ఆహార భద్రత!!!????

ఇక ఆహారభద్రత! 
1.కార్డుల పంపిణీకి సన్నాహాలు 
2.దరఖాస్తుల వివరాలు అడిగిన పౌరసరఫరాలశాఖ 3.30వేల కుటుంబాలకు లబ్ధి .
(న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ)

తాండూరు మండలం కరణ్‌కోటలో ఏడాదిన్నర కిందట నరేష్‌కు వివాహం జరిగింది. తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆహారభద్రత (రేషన్‌)కార్డు నుంచి తన పేరు తొలగించి భార్య, కుమారుడికి కలిపి కొత్త కార్డు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేశారు. ప్రభుత్వం కొత్త కార్డులు పంపిణీ చేయకపోవడంతో అతనికి ఇప్పటివరకు అందలేదు. దీంతో కుటుంబంలోని ముగ్గురికి నెలనెలా పద్దెనిమిది కిలోల చౌక బియ్యం కోల్పోవాల్సి వచ్చింది.


* పట్టణానికి చెందిన బస్వరాజ్‌ కుటుంబసభ్యులందరి ఆధార్‌ను ఆహారభద్రత కార్డుకు అనుసంధానం చేయాల్సి ఉండగా ఆలస్యం చేశారు. ఈక్రమంలో కార్డు రద్దు అయింది. తిరిగి ఆధార్‌ సమర్పించి అనుసంధానం చేసేందుకు అంతర్జాలం, మీసేవా కేంద్రాలకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. పౌరసరఫరాల వెబ్‌సైట్‌ కొంతకాలంగా నిలిచిపోయింది. దీంతో కుటుంబసభ్యులందరికి రావాల్సిన ఇరవైనాలుగు కిలోల బియ్యం ఏడాదికాలంగా రాకుండా పోయింది.అయితే జిల్లాలో ఇటువంటి వారికి ఒకటిరెండునెలల్లో కార్డులు అందనున్నాయి. ఎప్పటిమాదిరి నెలనెలా చౌకబియ్యం పొందనున్నారు.  కార్డుల పంపిణీకి పౌరసరఫరాలశాఖ సన్నద్ధమవుతోంది. కొంతకాలంగా నిలిచిన ప్రక్రియను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో అర్హులైన వారికి అందించేందుకు క్షేత్రస్థాయిలో దరఖాస్తుల వివరాలను ఆరాతీస్తోంది. కార్డుల పంపిణీ ప్రారంభమైతే జిల్లాలోని వందలసంఖ్యలో పేద కుటుంబాలకు చౌకబియ్యం పొందనున్నారు.


జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని పద్దెనిమిది మండలాల్లో 9.4లక్షల జనాభా నివసిస్తోంది. వీటిలో దారిద్య్రరేఖకు దిగవనున్న 2,61,988 కుటుంబాల్లోని ప్రజలకు నెలనెలా ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ ద్వారా చౌకబియ్యం సరఫరా చేస్తోంది. అందుకు జిల్లాలోని పద్దెనిమిది మండలాల పరిధి 501 రెవెన్యూగ్రామాలు, వికారాబాద్‌, తాండూరు మున్సిపాలిటీ వార్డుల్లో బియ్యం పంపిణీకి 588 చౌకదుకాణాల్ని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కార్డుల్లో నమోదైన ఒక్కో లబ్ధిదారునికి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని అందజేస్తున్నారు. నెలనెలా రూపాయికి కిలో చొప్పున కుటుంబ సభ్యులందరికి బియ్యం పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ కార్డుదారులకు కుటుంబసభ్యులతో పనిలేకుండా ముఫ్పైఐదు కిలోల బియ్యంతోపాటు కిలో చొప్పున చక్కెరను సరఫరా చేస్తున్నారు.

ప్రక్రియ పునరుద్ధరణ 
ఆహరభద్రత కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుండగా గతేడాది నుంచి స్తంభించింది. దీంతో వివాహం అయినా దంపతులు వేరుగా కార్డును పొందలేకపోయారు. సంతానం పేర్ల నమోదు ప్రక్రియసైతం గతేడాది జులై నుంచి ఆగిపోయింది. చౌకదుకాణాల్లో ఈపోస్‌ ప్రవేశపెట్టే క్రమంలో కొత్తగా లబ్ధిదారుల నమోదుకు వీల్లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా పనిచేసే వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. దీంతో  కొత్తగా చేరికలకు వీల్లేక చాలామంది పేదప్రజలు నిబంధనల ప్రకారం పొందాల్సిన బియ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కుటుంబసభ్యులు ఎక్కువ ఉన్నప్పటికి కొందరిపేరిట మాత్రమే బియ్యం సరఫరా కావడంతో మిగిలిన కుటుంబసభ్యుల నిమిత్తం బహిరంగ విపణిలో అధికధరలకు కొనుగోలు చేయాల్సి రావడంతో పేదలపై ఆర్థికభారంపడేందుకు దారితీసింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా చౌకదుకాణాల్లో ఈపోస్‌ యంత్రాల ఏర్పాటు పూర్తికావడంతో కార్డుల పంపిణీకి పౌరసరఫరాలశాఖ సిద్ధమైంది. అందుకు ఇప్పటివరకు ఎంతమంది కార్డులు పొందేందుకు దరఖాస్తు చేశారనే సమాచారాన్ని జిల్లాలోని మండలాలవారీగా తహసీల్దార్ల నుంచి సేకరిస్తున్నారు. వారంరోజుల్లోగా తహసీల్దార్లు పౌరసరఫరాలశాఖకు కొత్త కార్డుల దరఖాస్తు సంఖ్యా వివరాల్ని అందించేందుకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటివరకు నిలిచిన ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌సైతం ఏప్రిల్‌ నుంచి ప్రారంభించేందుకు ఖరారు చేశారు. దీంతో ఇప్పటికే కార్డులు కల్గిన వారు కుటుంబంలోని పిల్లల పేర్లను నమోదు చేయించేందుకు ఆస్కారమేర్పడనుంది. నమోదైన నెలరోజుల్లో వీరందరిపేరిట అదనంగా ఆరు కిలోల చొప్పున చౌకబియ్యం పంపిణీ చేయనున్నారు.

వేలసంఖ్యలో కుటుంబాలకు మేలు 
కార్డులు పొందేందుకు పద్దెనిమిది మండలాలతోపాటు తాండూరు, వికారాబాద్‌ మున్సిపాలిటీల్లో 10వేల దాకా దరఖాస్తులు సమర్పించినట్లు అంచనా. దీంతోపాటు తాజాగా దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైతే మరో 5వేలకుపైగా అదే అవకాశమున్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే కార్డులు కల్గిన వారు తమ కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేయించేందుకు దాదాపు మరో 10వేల దరఖాస్తులు వచ్చే ఆస్కారమున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరందరికి ఊరట లభించేలా వచ్చేనెలలో కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.త్వరలో జిల్లాలోని వేలమంది ఎదురుచూపులకు తెరపడనుంది.

వివరాలను సమర్పిస్తాం 
- సంధ్యారాణి, జిల్లా సంయుక్తపాలనాధికారి. 
కొత్త ఆహరభద్రత కార్డులు పొందేందుకు ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తు సంఖ్యా వివరాలను పౌరసరఫరాల కమీషనర్‌ కార్యాలయం అధికారులు అడిగారు. తహసీల్‌ కార్యాలయాల్లో ఎన్ని దరఖాస్తులు ఉన్నాయనే సమాచారాన్ని అందించాలని జిల్లాలోని తహసీల్దార్లకు సూచించాం. త్వరలో వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు అందజేస్తాం. వీరందరికి త్వరలో కార్డులు జారీచేసే అవకాశాలున్నాయి. మీసేవా కేంద్రాల్లో కుటుంబసభ్యుల వివరాల నమోదుకు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ సేవలను అతిత్వరలో పునరుద్ధరిస్తారు

Comments